మన ఆలయములు
భ్రువౌ కించిద్ భుగ్నేద్భువన భయభంగ వ్యసనిని
త్వదీయేనేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్,
ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతి నిగూఢాం తరముమే||
శ్రీమచ్ఛంకర భగవత్పాదులవారు వ్రాసిన సౌందర్యలహరిలో నలభైఏడోశ్లోకం ఇది. ఇది అమ్మవారి కనుబొమల వర్ణన. ఒకపుడు ఆచార్యులవారు కైలాసం వెళ్ళారు. అక్కడ ఈశ్వరానుగ్రహంచే మంత్రభాగమూ, ఆపాద మస్తకాంత వర్ణనా ఉన్న సౌందర్యలహరీ పంచలింగాలూ లభించేయ్. తిరిగివచ్చేటప్పుడు నందికేశ్వరు లాయనకుఅడ్డుతగిలి ఆచార్యుల వారిచేతిలోంచి సౌందర్యలహరి లాక్కున్నారు. అందు మంత్ర భాగంనలువదొక్కశ్లోకాలుమాత్రం ఆచార్యులవారికిదక్కేయ్, వర్ణనాభాగం ఏబదితొమ్మిదిశ్లోకాలు నందీకేశ్వరులచేతులలో నిలిచిపోయినయ్. లుప్తభాగం భగవత్పాదులవారు పూరించారు. దానిలోకూడా మంత్రా లణగివున్నయ్. సకలలోకాలకూ భయంపోగొట్టే భగవతీరూపం వర్ణించే శ్లోకమిది. భయనివృత్తి చేస్తుంది ఈశ్లోకం.
భయనివృత్తికోసం భగవతి కనుబొమలు కొంచెం వంగి ఉన్నయ్. అందుచేతనే 'భువనభయభంగవ్యసనిని' అన్నవిశేష ప్రయోగం. ఆ వంగిన కనుబొమలు ధనుస్సువలె ఉన్నవి. భుగ్నమనగా వంగినదనిఅర్థం. కనులు కర్ణపర్యంతమూ వ్యాపించి ఉన్నవి. ఆవిశాలాక్షి ఆకర్ణాంతవిశాలలోచన. నేత్రాలు తుమ్మెదలకాంతులు చిమ్ముతున్నవి. ఈ ధనుస్సు ఎవరిది? రతిపతి మన్మథునిది, అతడు అందాలరాజు. వాని విల్లున్నూ వానివలెనే అందంచిందుతూ ఉంటుంది. అది చెరకువిల్లు. దాని నారి తుమ్మెదలబారు, ''మౌర్వీ మధుకరమయీ'' అని మరొకచోట ఆచార్యులవారే సౌందర్యలహరిలో వ్రాశారు.
మేఘాలు ఆకాశంలో దట్టంగా కమ్ముకొని, గర్జనలు చేస్తున్నప్పుడూ, పిడుగులుపడుతున్నప్పుడూ పెద్దలు అర్జునుని పదిపేరులూ చెప్పుతుంటారు.
''అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః,
భీభత్సు ర్విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః||''
పిడుగులు ఇంద్రధనుస్సులు, అందుచే పిడుగులు పడేటప్పుడు ఇంద్రునికొడుకు అర్జునుని నామావళిని ఉచ్చరించటం. వీనిలో సవ్యసాచి యనే పేరొకటి ఉన్నది. సవ్యసాచి అనగా ఎడమచేతితో బాణాలు వదలేవాడు. సాధారణంగా వింటిని ఎడమచేతితో బాణాలు కుడిచేతితో బాణాలు వదలుతుంటారు. దీనికి విరుద్ధమైన అలవాటు అర్జునునిది. మన్మథుడున్నూ సవ్యసాచివలె ఉన్నాడు. 'సవ్యేతరకర గృహితం' అన్న పదప్రయోగం దీనిని సూచిస్తున్నది. ధనుస్సు పట్టుకొన్నప్పుడు పిడికిటిలో కొంతభాగం మాటుపడుతుంది. ప్రకోష్ఠమంటే ముంజేయి, ముష్టి అంటే పిడికిలి, అమ్మవారి నాసిక ప్రకోష్ఠం, కనుబొమలలో మాటుపడినభాగం మన్మథునిముష్టి, కనుబొమలు విల్లు, కనులే అల్లెత్రాడు.
జగముల కీడు బోగొట్ట దలచే ఓ తల్లీ! ఇంచుక వంగిన కనుబొమలే మన్మథునకు విల్లు. నీ కనులే అల్లెత్రాడు. నీ నొసలు నాసికయూ ముష్టికోష్ఠములు.
మధువనం అనే ఒక క్షేత్రం దక్షిణదేశంలో ఉన్నది. దాన్నే 'సన్నిలమ్' అని అంటూఉంటారు. ఆ క్షేత్రంలో తేనెటీగలు మహాలింగమును పూజిస్తున్నట్లు ఐతిహ్యం ఉన్నది. నేటికిన్నీ ఆలయములో తేనెతుట్ట లున్నవి. దానికి మధువనమనే పేరు. అందుచేతనే-
చోళరాజులలో కొచ్చెంగచోళుడనే రాజోక డుండేవాడు. 'కో' అంటే కిరీటంకల రాజు అని అర్థం 'చెంగ' అంటే ఎరుపుదేరిన కనులు గలవాడు అని అర్థము. సంస్కృతభాషలో రక్తాక్షచోళు డంటారు. ఆ చోళరాజు గొప్ప శివభక్తుడు. ఆయన ఆలయరక్షణ కార్యాలలో ఎంతో శ్రద్ధవహించేవాడు. తమిళంలో ఈ కార్యాలకు 'తిరుప్పణి' అని పేరు, ఆయన చేసిన 'తిరుప్పణి'కి యానై ఏరాత్తిరుపణి' యనిపేరు. యానై - అనగా ఏనుగు, అనగా ఏనుగులోనికిపోనట్లు ఆయన ఆలయాలు కట్టించాడుట. ఈపదంవల్ల అంతకుమునుపు ఏనుగులు లోనికి వెళ్ళడానికి వీలయినట్లు ఆలయాలుకట్టబడినవని మనంస్పష్టంగా గుర్తించగలం. మహరులు వన్యప్రదేశాలలోనూ, చెట్లకిందనూ నదీతీరాలలోనూ మహాలింగాలను ఆత్మార్థం పూజచేస్తూ వచ్చేవారు. ఇతరజనులు దగ్గరకు వచ్చేవారు కారు. కలియుగంలో రాజులు అట్టి శివపూజ అందరకూ ఉపయోగపడటానికి తగిన ఏర్పాటులు చేసేవారు. బ్రాహ్మణుల సంధ్యకూ, జపానికీ, శివపూజకూ భంగంలేకుండా ఉండేటట్లు రాజులు గమనించేవారు. ఆత్మార్థం మహరులు పూజిస్తుండిన మహాలింగములున్న చోటులలో అగమవిధులననుసరించి ఆలయాలు నిర్మించి వానికి ప్రత్యేకించి దీక్షపొందిన పూజకులను నియమించేవారు. ధర్మశాస్త్రాలప్రకారం బ్రాహ్మణులు డబ్బుపుచ్చుకొని పూజచేయరాదు. అందుకే దీక్ష. ఆత్మార్థం వైదికపూజలు చేస్తూ వచ్చిన మహరులచేత ప్రతిష్ఠచేయబడిన మహాలింగాలే ఆగమశాస్త్రాలప్రకారం కట్టబడిన ఆలయాలలో ప్రతిష్ఠచేయబడినట్లు ఈపయికారణకలాపాలచే గ్రహించగలం. ఈనాటికిన్నీ ఒక్కొక్క క్షేత్రంలో స్థలవృక్షాలు చూస్తున్నాము. తిరుచ్చినాపల్లిలో ఉన్న జంబుకేశ్వరంలో నేరేడుచెట్టూ, కంచిలో మావిచెట్టూ, మధ్యార్జున మల్లికార్జునక్షేత్రంలో తెల్ల మద్దీ ఇవన్నీ స్థలవృక్షాలుగా కనిపిస్తున్నవి.
తిరువానైక్కావల్ (జంబుకేశ్వరక్షేత్రము) క్షేత్రంలో తిరుప్పణిజరిగినకాలంలో నేరేడు దాదాపు శిధిలమై ఏదోకొంత బెరడుతో స్కంధంమాత్రం మిగిలిఉంది. అదిన్నీ నశించిపోతుందేమో అని భయపడ్డారు. ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆ మంత్రశక్తికి చెట్టు చిగిరించి మరల బాగైనదట. ఇప్పటికిన్నీ తిరువానైక్కావల్ ప్రక్కగా ''వెణ్ణావాల్'' అనే ఊరుఉన్నది. నావల్ అనగా జంబూవృక్షం (నేరేడు). కొచ్చెంగచోళుడు చేసిన తిరుప్పణిలో ఏనుగులకు ఆలయప్రవేశం బహిష్కరింపబడ్డది. ఎందుచేత? కొచ్చెంగడికి ఏనుగులంటే ద్వేషం. పూర్వం ఎవనిమీదనైనాసరే ద్వేషముంటే వానికి 'శివభక్తి లేకపోవుగాక' అని శాపంపెట్టేవారట. ఒకడు మరొకని చేయగల తీవ్రమైన అపకారం అంతేట. ఐతే కొచ్చెంగచోళుడికి గజ ద్వేషమెందుకు? మనం దానికి స్థలపురాణం వెదకాలి. ఏవో కొన్ని క్షేత్రపురాణాలు కల్పితాలనేభావం ఉంచుకొని, అన్ని స్థలపురాణాలనూ కట్టుకథలని త్రోసివేయరాదు.
తేవారాలో (శివభక్తిచాటేపాటలు) ఆయాస్థలానికి గల ఐతిహ్యంకూడా ఇమిడిఉంది. ఆ ఐతిహ్యాలు ఆయాస్థల పురాణాలలో కనబడతవి. తేవారాలకాలమే 1500 సంవత్సరాల వెనుక. దానికి పూర్వం అనాదిగా వస్తున్న పురాణాల్లోనిప్రమాణాలనూ, కథలనూ భక్తులు తేవారాలలో గానంచేశారు. తిరువానైక్కానల్ క్షేత్రంలో ఇప్పటికిన్నీ ఒక నేరేడుచెట్టూ, దానిక్రింద లింగమూ, తొండంతో అభిషేకిస్తున్నట్లున్న ఏనుగు శిల్పమూ, దానిప్రక్క సాలెపరుగూ, శాసనమూ కనబడుతూంది. ఈక్షేత్రంలో ఇట్టి చిహ్నా లుండటానికి కారణం, ఇక్కడ జంబుమహరి తపస్సుచేసికొంటూ, అట్లే కూర్చుండి ఉన్నందువల్ల వారిచుట్టూ పుట్ట ఒకటి ఏర్పడి లతాగుల్మాలు మొలచినవి. వానితోపాటు ఒక జాంబూవృక్షమున్నూ మొలచినది. వారు పూజిస్తూవచ్చిన మహాలింగాన్ని ఒక చెలదిపుర్వు సైతమూ ఆరాధిస్తూవచ్చింది. లింగంమీద ఎండపడరాదని అది గూడుపెట్టింది. ఆ పరిసరాలలోనే ఉన్న ఏనుగొకటి కావేరిలో నుండి తొండంతో నీరుతెచ్చి మహాదేవునికి అభిషేకం చేసేది. ఈ గండూషాంబుసేచనంలో సాలెగూడు ఒక్కతృటిలో మాయమైపోయేది. సాలెపురుగుకు కోపం వచ్చింది. ఒకనాడు ఏనుగు తొండంలోకి పాకి కరచింది. అయుర్వేదంలో సాలెపురుగువిషం చాలా అపాయకరమైనదని చెప్పబడిఉంది. తొండంలో చిక్కుకున్న సాలీడూ ఏనుగూ రెండున్నూ నశించినవి. ఆ చెలదిపురువే మరుసటిజన్మలో కొచ్చెంగచోళుడైపుట్టింది. అందుచే జన్మాంతర మందున్నా కొచ్చెంగచోళునికి ఏనుగులంటే ద్వేషం. అతడు దాదాపు డెబ్బది క్షేత్రాలలో జీర్ణాలయోద్ధరణం చేశాడు. అన్నిటిలోను ఏనుగులకు బహిష్కారమే. అతని శివభక్తి ఆళ్వార్లు సహితం పెరియతిరుమొళిలో ఎంతో శ్లాఘించారు. కొచ్చెంగ చోళుడు నాచ్చియారు కోవెలలో విష్ణ్వాలయం నిర్మించాడు. ఆవిషయం పెరియతిరుమొళిలో ఉన్నది. దానితోపాటు అతని శివభక్తికూడ శ్లాఘింపబడ్డది.
|